జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. గాంధీజీని ప్రేమిస్తాం. అంబేద్కర్‌ని ఆరాధిస్తాం. సర్దార్ పటేల్‌కి సెల్యూట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ, తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూపోతే చూస్తూ కూర్చోం.. మెడలు వంచి కింది కూర్చోపెడతాం అంటూ ట్వీట్ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ యువత జనవరి 26న వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిశ్శబ్ద నిరసనకు ప్రణాళికలు రచిస్తే.. జనసేన వారికి పూర్తిగా మద్దతిస్తుంది’’ అని ట్వీట్ చేశారు. అవకాశవాద, నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్‌ను జనసేన విడుదల చేయనుందన్నారు. 'దేశ్ బచావో' పేరిట ఈ ఆల్బమ్ ఉంటుందని, దీన్ని జనవరి 24న విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఈ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించామని పవన్ తెలిపారు.