నేడు విశాఖ సాగరతీరంలో జరగనున్న ప్రత్యేక హోదా అనుకూల ర్యాలీలు, మౌన దీక్షలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రావడం లేదని తెలుస్తోంది. హోదా ర్యాలీలను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితులను బట్టి కాస్త వేచి చూడటమే బెటర్ అని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలించి ఆర్కే బీచ్‌లో ర్యాలీలకు ప్రభుత్వం అనుమతించిన పక్షంలో, ర్యాలీ గ్యారంటీగా కొనసాగుతుందని తేలిన పక్షంలో పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పా పెట్టకుండా ఆర్కే బీచ్‌లో వాలిపోదామని పవన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నేడు ర్యాలీకి పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడానికి కారణం కూడా ఉంది. బుధవారం నాడు కూడా పవన్ మెదక్ జిల్లాలో కాటమరాయుడు సినిమా షూటింగులో పాల్గొంటున్నట్లు సమాచారం. అందుకే షూటింగ్ విరామ సమయంలో మాత్రమే పవన్ 26నుంచి ఆర్కే బీచ్‌లో జరగనున్న ప్రత్యేక హోదా నిరశన దీక్షకు సిద్ధమవడం గురించి అప్పుడప్పుడూ ట్వీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హోదా కోసం దీక్షలు ఒకసారి మొదలయ్యాక పవన్ కల్యాణ్ ఇకే మాత్రం హైదరాబాద్‌లో ఉండలేరని, జనవరి 27 తర్వాత మాత్రమే ఎవరికీ చెప్పకుండా ఆర్కే బీచ్‌లో ప్రత్యక్షమవడానికి పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ర్యాలీలకు అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పడంతో పోలీసు శాఖను ఒత్తిడి చేయమంటూ జన సేన కార్యకర్తలను కోరినట్లు తెలుస్తోంది.