రాష్ట్ర వ్యాప్తంగా 61.12 లక్షల మందికి పెన్షన్లు

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:25 IST)
రాష్ట్ర వ్యాప్తంగా 92.19 శాతం మంది లబ్ధిదారులకు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేశారు. మొత్తం 61.12 లక్షల మంది పెన్షనర్లకు ఉదయం ఆరు గంటల నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ సొమ్మును లబ్ధిదారుల చేతికే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ మేరకు దాదాపు 56.35 లక్షల మందికి అంటే 92.19శాతం మందికి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు పెన్షన్ల పంపిణీని పూర్తి చేశారు. ఏప్రిల్ నెలలో పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1472.95 కోట్లు కేటాయించగా, తొలిరోజునే దాదాపు రూ.1349.77 కోట్లు పంపిణీ చేశారు.

మొత్తం మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ నూరు శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మూడో తేదీ వరకు మిగిలిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సామాజిక పెన్షన్లు, వైద్య పెన్షన్లను నెల ఒకటో తేదీనాడే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వారి చేతికే అందించాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లు, 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అయ్యారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్బంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలతో పాటు ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ ను కూడా పరిగణలోకి తీసుకుని పెన్షన్లను పంపిణీ చేశారు. తొలిరోజే 92 శాతంకు పైగా పెన్షన్లను పంపిణీ చేసిన వాలంటీర్లను ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు