విజయవాడ: అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గవర్నర్ దంపతులు శ్రీ హరిచందన్, శ్రీమతి సుప్రవ హరిచందన్ బుధవారం రాజ్ భవన్లో రెండవ మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
కోవాక్సిన్ యొక్క రెండవ మోతాదు తీసుకున్న తదుపరి గవర్నర్ మాట్లాడుతూ తొలిదశ టీకా తీసుకున్న తర్వాత జ్వరం, నొప్పి వంటి ప్రతికూల ప్రభావాన్ని అనుభవించలేదన్నారు. వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమే కాక ఖచ్చితంగా అవసరమని స్పష్టం చేశారు. కరోనా పై పోరులో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తమదైన భూమికను పోషించటం ముదావహమన్నారు.
కోవిడ్ నియమావళిని అనుసరించటం, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎల్లప్పుడూ ముసుగు ధరించడంతో పాటూ ఇతర చర్యలను కూడా పాటించటం అవసరమని గవర్నర్ అన్నారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు, ట్రాకింగ్, చికిత్స, టీకా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. టీకా కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని పాల్గొనగా, నూతన ప్రభుత్వ ఆసుపత్రి నర్సు ఝాన్సీ గవర్నర్ దంపతులకు టీకా వేశారు.