ప్రజలపై నిప్పుల వాన కురిపిస్తున్న సూరీడు... బయటకు రావొద్దంటున్న వాతావరణ నిపుణులు

వరుణ్

బుధవారం, 17 ఏప్రియల్ 2024 (10:56 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దక్షిణ భారతంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలపై సూరీడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కొవిలంలో మంగళవారం ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 88 మండలాల్లో వడగాలులు వీశాయి. నేడు మరో 46 మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకురావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా, వృద్ధులు, గర్భిణి మహిళలు, చిన్నారులు అస్సలు రావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాతావరణ శాఖ కూడా ఎప్పటికపుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. 
 
విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్టణం, తిరుపతి, బాపట్ల, వెస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం కూడా 88 మండలాల్లో వడగాలులు వీచినట్టు పేర్కొంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణిలు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు