ఒంగోలులో స్పా - మసాజ్ కేంద్రాల్లో అనైతిక కార్యకలాపాలు.. విటులు - యువతుల అరెస్టు!!

వరుణ్

మంగళవారం, 23 జులై 2024 (09:21 IST)
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని స్పా, మసాజ్ సెంటర్లలో విచ్చలవిడిగా అనైతిక కార్యకలాపాలు గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నేతలు తమ అనుచరుల ద్వారా ఇలాంటి కేంద్రాలను ప్రారంభించి, వాటిలో అనైతిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినప్పటికీ ఈ కేంద్రాల తీరు మాత్రం మారలేదు. దీంతో అనేక మంది స్థానికులు, ఆయా భవనాల యజమానులు ఈ అనైతిక కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ దామోదర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేసి పలువురు విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తనయుడుకి అత్యంత సన్నిహితుడు కూడు ఉండగా, పోలీసులు మాత్రం అతన్ని తప్పించేశారు. ఇది పోలీసు వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
జిల్లా కేంద్రంలో 16 స్పా, మసాజ్ కేంద్రాల్లో ఏకకాలంలో పోలీసు బలగాలు దాడులు నిర్వహించాయి. వీటిల్లో కొందరు యువతులతో పాటు పురుషులు దొరికారు. వారిలో మాజీ మంత్రి తనయుడికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. తదనంతరం చూపిన అరెస్టుల్లో మాత్రం అతని ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ఈ విషయంలో కొందరు పోలీసు సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒంగోలులోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో పలువురు అధికారులు, సిబ్బంది వైకాపా నేతలకు అత్యంత సన్నిహితంగా పనిచేశారు. 
 
తమ బాధ్యతలు మరిచి మాజీ మంత్రికి వీర విధేయులుగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ బదిలీ ప్రక్రియ ఇప్పటికీ ముందుకు సాగలేదు. దీంతో వీర విధేయులు ఇంకా ఆయా స్టేషన్‌లలోనే విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు రోడ్డులోని స్పా కేంద్రంలో తనిఖీల సమయంలో దొరికిన మాజీ మంత్రి తనయుడికి అత్యంత సన్నిహితుడిని తప్పించడంలో తాలూకా పోలీస్ స్టేషన్‌లోనే పనిచేసే సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు విశ్వసనీయ సమాచారం.
 
స్పా కేంద్రంలో ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకోగా.. అతనొక్కడే తప్పించుకోవడం వెనుక సదరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు మాట్లాడుతూ.. తాము చేసిన దాడుల్లో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చిక్కినట్టే చిక్కి.. పారిపోయాడని చెప్పారు. అతనిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు