వైసిపిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ... ఆ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు లేరు అంటూ చెప్పారు ఏపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడిచిన వైసిపిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గోతిలో పాతేశారని సంచలన వ్యాఖ్యలు చేసారు. కనుక వైసిపిలో వైఎస్సార్ లేరని మరోసారి గట్టిగా చెబుతున్నా అంటూ వెల్లడించారు షర్మిల.
ఆమె మాట్లాడుతూ.. ''వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ... వైసీపీకి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధం లేదు. వైఎస్ఆర్ గారు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే హెచ్చరిక. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదు. మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడే భైఠాయించి ధర్నా చేస్తా. ఇలాంటి హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందనే ప్రజలు ఘోరంగా వైసీపీని ఓడించారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని హెచ్చరిస్తున్నాను.'' అని చెప్పారు.