పోలీసుల ఎన్ కౌంటర్లను ప్రోత్సహించకూడదు: సుప్రీంకోర్టు మాజీ జడ్జి

సోమవారం, 7 డిశెంబరు 2020 (23:41 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించి సరిగ్గా ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ  జడ్జి జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పోలీసుల ఎన్ కౌంటర్లను ప్రోత్సహించకూడదని చెప్పారు. వీటి వల్ల అమాయకులు బాధితులుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే రేపు మనలో ఎవరో ఒకరు కూడా బాధితులుగా మారుతామని చెప్పారు. అందుకే ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష చర్యలను సమర్థించకూడదని అన్నారు. హైదరాబాదులోని ఇక్ఫాయ్ లా స్కూల్ లో ఆయన లెక్చర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
న్యూస్ పేపర్లలో వచ్చిన ఎన్ కౌంటర్ వార్తలు చదవడానికి చాలా బాగుంటాయని చలమేశ్వర్ అన్నారు. ఒక నలుగురిని ఎన్ కౌంటర్ చేసినంత మాత్రాన ఇలాంటి క్రిమినల్ చర్యలను మనం అరికట్టలేమని చెప్పారు. స్థానిక పోలీసుకు నీవు నచ్చకపోతే ఏదో ఒక కేసులో ఇరికిస్తాడని... ఆ తర్వాత నీకు ఏమైనా జరగొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.
 
హైదరాబాదులో ఎన్ కౌంటర్ జరిగినప్పుడు సమాజంలోని ఎంతో మంది సెలబ్రేట్ చేసుకున్నారని... తద్వారా న్యాయవ్యవస్థ అసమర్థంగా ఉందనే హింట్ ను వారు ఇచ్చినట్టైందని అన్నారు.

న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరగడానికి చాలా కాలం పడుతుందని, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకుంటూ పోతే 20 ఏళ్లు కూడా పట్టొచ్చనే అభిప్రాయంలో ప్రజలు ఉండొచ్చని... వారి అభిప్రాయాలు వారివని చెప్పారు. దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపలేకపోయాయని అన్నారు.
 
న్యాయాన్ని అమలు చేయడంలో ప్రతి రోజు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని చలమేశ్వర్ చెప్పారు. చట్టాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతే... క్రమంగా న్యాయ వ్యవస్థ నిర్వీర్యమవుతుందని అన్నారు. ప్రజలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు