Potti Sriramulu Jayanti: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆద్యుడు.. జాతిపిత మార్గంలో..?

మంగళవారం, 16 మార్చి 2021 (10:42 IST)
Potti Sriramulu Jayanti
పొట్టి శ్రీరాములు జయంతి నేడు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. 
 
పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటపల్లెకు చెందినవారు. ఆయన తండ్రి గురవయ్య. తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు గారి బంధువుల కుటుంబాలు మద్రాసులో వున్నందున గురవయ్య గారు కూడా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములుగారు మద్రాసు జార్జిటౌన్ అణ్ణాపిళ్ళె వీధిలోని 165 నంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. ఇరవై ఏళ్ళ వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. 
 
బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశారు. ​త్వరలోనే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో నెలకు రు.250/- జీతంగల ఉద్యోగంలో చేరారు. పాతికేళ్ల ప్రాయంలోనే ఆయన భార్య గతించింది. ఆ కారణంగా ఐహిక సుఖాలపట్ల ఆయనకు విరక్తి కలిగింది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని నిశ్చయించారు. 1952 డిసెంబర్ 15వ తేదీన మద్రాసులో తుది శ్వాస విడిచారు.
 
స్వాతంత్య్ర సమరయోధుడు జతిన్‌దాస్‌ తరువాత అత్యంత సుదీర్ఘ కాలం నిరాహార దీక్ష చేసిన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక్కరే. స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి పునాదులు పడ్డాయి. 1912లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ప్రస్తావన వచ్చింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రాల విభజనను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనే అంశంపై నాటి కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. 
 
అవిభక్త మద్రాసులో వున్న తెలుగు వారు ఎప్పటినుంచో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొందరు జాతీయ నాయకులు ప్రత్యేకాంధ్ర వైపు మొగ్గుచూపారు. అయితే, నాయకుల మధ్య అనైక్యత వల్ల 1952 వరకు ప్రత్యేకాంధ్ర కార్యరూపం దాల్చలేదు. పొట్టిశ్రీరాములు గాంధీజీ మార్గంలో పయనించి 1952 అక్టోబర్‌ 19న మద్రాసులో మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
 
దేశవ్యాప్తంగా ఎందరో జాతీయోద్యమనాయకులు ఈ దీక్షను సందర్శించారు. మద్దతుగా మరెంతో మంది ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం తేల్చలేదు. 58 రోజుల పాటు దీక్ష కొనసాగించి డిసెంబర్ 15న అసువులు బాశారు. ఆయన ప్రాణ త్యాగంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ర్టాన్ని ఏర్పరిచింది. కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయగా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. 
 
భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ప్రసిద్ధి పొందింది. 1956లో ఆంధ్ర, తెలంగాణలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు చిన్నతనం నుండే గాంధీజీ ఆశయాలను పుణికిపుచ్చుకుని దేశభక్తితో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ‘శ్రీరాములు వంటి మరో పది మంది సహచరులు నాకు లభిస్తే ఒక్క సంవత్సరం లోనే బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కల్గించగలనని’ గాంధీజీ అన్నారంటే ఆయన ఎంతటి ఉద్యమశీలి అనేది అర్థమవుతుంది. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని నవ్యాంధ్ర పునర్‌నిర్మాణానికి నడుం బిగించాలి. 
 
హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకుని ప్రచారం చేశారు. మండుటెండల్లో చెప్పులు, గొడుగు లేకుండా జాతీయోద్యమాన్ని చాటి ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు "పిచ్చి శ్రీరాములు" అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది.
 
"పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు వుంటే, మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్ర్యం తెచ్చి పెట్టగలను" అన్నారు గాంధీజీ. దేశభాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడాయన.
 
గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి జాతీయోద్యమ శంఖారావం పూరించారు. బాపూజీ పిలుపు విన్న పొట్టి శ్రీరాములు 1927లో తన ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. తన ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచి పెట్టారు. సబర్మతీ ఆశ్రమం చేరారు. గాంధీజీ శిష్యులుగా నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. మూడు సార్లు రాజకీయ నిర్భందితులుగా కారాగార వాసం చేశారు. 
 
సత్యాగ్రహం, శాసనోల్లంఘనం వంటి ఉద్యమాల్లో అగ్రగామిగా వుంటూ గాంధీజీ ప్రశంసలందుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోను, వివిధ ప్రాంతాల్లోనూ, మన రాష్ట్ర మందలి కొమరవోలులోను నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప సేవచేశారు. 1941-1942 సంవత్సరాల సత్యాగ్రహం, 'క్విట్ ఇండియా' ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1944లో నెల్లూరు కార్యక్షేత్రంగా ఖద్దరు ఉత్పత్తి, వ్యాప్తి కార్యక్రమాల్లో తీవ్రంగా కృషి చేశారు.
 
1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ఫలితంగా హరిజనులు ఆలయంలో ప్రవేశింపగలిగారు. ఆ సంవత్సరంలోనే మద్రాసు ప్రభుత్వంచే హరిజనుల ఆలయప్రవేశం, హరిజనోద్ధరణకు సంబంధించిన రెండు శాసనాలను ఆమోదింప చేసేందుకు 23 రోజుల నిరశన దీక్ష చేశారు. ఆయన వజ్ర సంకల్పం ఫలించింది. మూడో మారు వార్థాలో 1948లో నిరాహార దీక్ష 29 రోజులు సాగించారు.
 
ఆయన పదవులకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం ఏనాడూ పోరాడలేదు. గాంధీజీ బోధించిన సత్యాహింసలు, హరిజనోద్ధరణ ఆయన జీవితాశయాలు. మిత్రుల వత్తిడిని కాదనలేక కొంత కాలం ఆంధ్రరాష్ట్ర గాంధీ స్మారక సంఘ కార్యదర్శిగా పనిచేశారు.
 
శ్రీరాములుగారు జీవితపు చివరి దశలో నెల్లూరులో వుంటూ హరిజనోద్ధరణకు నిర్విరామంగా పనిచేశారు. హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని వ్రాసిన అట్టలను మెడకు, వీపుకు తగిలించుకుని ప్రచారం చేసేవారు. త్యాగమే ధనంగా పెరిగిన ఆయన ముతక ఖద్దరు దుస్తులు ధరించి, నెల్లూరు పట్టణ వీధుల్లో దయగలవారు పెట్టిన ఆహారంతో బ్రతికారు. కాళ్లకు చెప్పులుగాని, తలపై గొడుగుగాని లేకుండా మండుటెండల్లో తిరుగుతూ జాతీయ ఉద్యమ ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు "పిచ్చి శ్రీరాములు" అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది.
 
మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న సవతి తల్లి దృష్టిని ఆయన గమనించారు. మద్రాసు నగరంపై ఆంధ్రులకు హక్కు వున్నదని, ప్రత్యేక ​ఆంధ్రరాష్ట్రం వల్లనే ఆంధ్రులు బాగుపడగలరని ఆయన భావించారు. 1952 అక్టోబరు 19వ తేదీన మద్రాసులోని మైలాపూర్‌లో బులుసు సాంబమూర్తిగారి బసలో 4వ సారి నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆ దీక్ష అవిచ్ఛిన్నంగా సాగింది. 
 
ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి పోయింది. ప్రజల్లో ఆందోళన పెరిగింది. తనకు స్పృహ తప్పిన పక్షంలో తన వ్రతానికి భంగం కలిగించే విధంగా ఎట్టి పని చేయరాదని ఆయన శాసించారు. ఆంధ్రనాయకులు దేశాధినేతలకు విన్నపాలు పంపారు. కేంధ్రప్రభుత్వం చూస్తూ వుండిపోయింది. చివరకు ఆ దధీచి 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రాణత్యాగం చేశారు.
 
శ్రీరాములుగారి మరణవార్త మెరుపుతీగలా దేశమంతటా వ్యాపించింది. ఆంధ్రుల సహనం హద్దులు దాటి విశృంఖలంగా దౌర్జన్యానికి దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభంజనానికి ఎదురు నిలువలేక ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అంగీకరించింది. 1953 అక్టోబర్ 1 వ తేదీన కర్నూలు రాజధానిగ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
 
ఆంధ్రుల అంతిమ లక్ష్యమైన ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ రాజధానిగా అవతరించింది. మైలాపూర్ రాయపేట హైరోడ్‌లోని 126 నంబర్‌న పొట్టి శ్రీరాములుగారు కన్నుమూసిన ఇంటిని ఆ త్యాగమూర్తి స్మృతిచిహ్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు