చేప ఆకారంలో వింత శిశువు జననం.. ఎక్కడ?

శుక్రవారం, 12 మార్చి 2021 (10:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఓ వింత శిశువు జన్మించాడు. ఈ శిశువు చేప ఆకారంలో ఉండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలోని నయాపూల్‌ ఆసుపత్రిలో సంగారెడ్డికి చెందిన ఓ మహిళ బుధవారం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ వింతగా పుట్టాడు. 
 
శిశువులో చెవితోపాటు చేతి వేళ్లు సక్రమంగా అభివృద్ధి చెందలేదు. రెండు కాళ్లు కలిసిపోయి చేప ఆకారాన్ని తలపించాయి. అయితే, ఈ శిశువు పుట్టిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. క్రోమోజోముల విశ్లేషణతోపాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల ప్రభావం తెలుసుకునేందుకు ప్లసంటా (మాయ)ను బయాప్సీకి పంపినట్లు వైద్యులు తెలిపారు. 
 
దీనిపై గాంధీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్‌ మహాలక్ష్మి మాట్లాడుతూ.. ‘శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదటి 8-12 వారాలు కీలకం. మత్తు పదార్థాల వినియోగం, ఇన్‌ఫెక్షన్లు, పోషకాహారం, ఫోలిక్‌ యాసిడ్‌ లోపంతో ఇలాంటి శిశువులు జన్మించే అవకాశాలు ఉన్నాయి. దగ్గర సంబంధాలు, మేనరిక వివాహాల వల్ల కూడా జన్యుపరమైన లోపాలు తలెత్తి ఇలా జరుగుతుంది. స్కానింగ్‌లో 20 శాతం వరకు శిశువులో లోపాలను కనిపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు’ అని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు