తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదనకు (ఈజీ మని) అలవాటుపడిన కొందరు నిర్వాహకులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పెద్దల అండదండలతోపాటు, స్థానిక పోలీసుల మద్దతును తీసుకుంటున్నారు. నెల నెలా మామూళ్లకు అలవాటు పడిన కొందరు పోలీసులు అక్కడ ఏం జరిగినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారు. ఈజీ మనికి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నారాయణగూడ, హిమాయత్‌నగర్ వంటి సంపన్న ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు.
ఇందులోభాగంగా, బాడీ మసాజ్ పేరుతో ఏర్పాటు చేసిన స్పా, మసాజ్ సెంటర్లకు వచ్చే కస్టమర్లకు అందమైన యువతులతో నిర్వాహకులు ఎర వేస్తున్నారు. ముఖ్యంగా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్, టాంజానియా, నార్త్ ఇండియా, హైదరాబాద్‌తోపాటు గుంటూరు, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి అందమైన యువతులను రప్పిస్తున్నారు.
ఆ తర్వాత ఖరీదైన స్పా సెంటర్లకు సంపన్న వర్గాలకు చెందిన వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతోపాటు రాజకీయ ప్రముఖుల పుత్ర రత్నాలు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అనేకసార్లు పోలీసులు నిర్వహించిన దాడుల్లో బడాబాబుల పిల్లల వెకిలి మకిలీ బయటపడింది. అలాంటి వారి పుణ్యమాని ఆయా సెంటర్ల నిర్వాహకులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పార్లర్‌పై ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. చందానగర్‌లోని సన్‌షైన్ స్పా అండ్ బ్యూటీ కేర్‌లో వ్యభిచారం చేస్తున్న నలుగురు విటులను అరెస్టు చేశారు. నలుగురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు. వారి నుంచి రూ.15 వేలు, 8 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను చందానగర్ పోలీసులకు అప్పగించారు.