ఉద్యోగం పేరిట మహిళలకు ఎర.. ఆపై వ్యభిచార గృహాలకు విక్రయం.. చిత్తూరులోనే

గురువారం, 1 సెప్టెంబరు 2016 (05:09 IST)
ఉద్యోగాల పేరిట అమ్మాయిలకు ఎరవేసి ఆపై వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఓ ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం పేరిట ఓ మహిళను మోసం చేసి మలేషియాలోని వ్యభిచార గృహంలో అమ్మేశారు. ఆమె ఏడు నెలల పాటు వేశ్యగా మారి వచ్చిన డబ్బుతో అక్కడి వ్యభిచార గృహ నిర్వాహకులకు రూ.1.80 లక్షలు చెల్లించి భారత్‌కు తిరిగి వచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్తూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. 
 
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత నుంచి తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఉద్యోగం పేరిట మోసం చేసి తనను మలేషియాలోని వ్యభిచార గృహంలో అమ్మేసినట్లు తెలిపిందని, ఏడు నెలల పాటు వేశ్యగా మారి వచ్చిన డబ్బుతో అక్కడి వ్యభిచార గృహ నిర్వాహకులకు రూ.1.80 లక్షలు చెల్లించి భారత్‌కు తిరిగి వచ్చినట్లు ఫిర్యాదు రావడంతో కేసు దర్యాప్తు చేశామన్నారు. 
 
తమిళనాడులో చెన్నైలోని కొడుంగయూర్‌కు చెందిన ఎ.రఫి (41) అనే వ్యక్తి స్థానికంగా విమాన టికెట్ల బుకింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ దుబాయ్, మలేషియా, షార్జాకు వెళ్లే వాళ్లకు టికెట్లు, వీసా ఇపిస్తూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళల్ని మధ్యవర్తుల ద్వారా గుర్తించి వీళ్లను మలేషియాలోని వేశ్య గృహాలకు తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. అలా మలేషియాలోని ధను అనే మహిళకు చెందిన వేశ్య గృహంలో ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో మహిళలను విక్రయించినట్టు అంగీకరించాడని తెలిపారు. 
 
ఆ తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ అక్రమ రవాణాలో ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న తమిళనాడులోని మదురై జిల్లా సెల్లూరుకు చెందిన పాండియరాజన్ (38) అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశామని చిత్తూరు పోలీసులు తెలిపారు. సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో పట్టున్న ఇతను రఫీకి పలువురు మహిళల్ని పరిచయం చేయించి వాళ్లను అక్రమంగా వేశ్య గృహాలకు విక్రయించడంలో తోడ్పడేవాడు. నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని రత్న తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి