అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

డీవీ

మంగళవారం, 24 డిశెంబరు 2024 (21:00 IST)
Pawan kalyan- allu arjun family
పుష్ప 2 సినిమా విడుదలకుముందు సంధ్య థియేటర్లో జరిగిన పరిణామాలు తెలిసినవే. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం ఆ తర్వాత సినీ పెద్దలు పరామర్శించడం మామూలుగానే జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కుటుంబాలు అల్లు అర్జున్ కుటుంబాన్ని పలుకరించి ధైర్యం నూరిపోశారు. అదే టైంలో విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. మేనల్లుడిని కలుస్తారని పలు ప్రసారసాధనాలు, సోషల్ మీడియా పలు కథనాలు వేశాయి. కానీ ఆయన ఎక్కడా కలిసినట్లు స్పష్టత లేదు. ఫొటోలుకూడా లేవు.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నాగబాబు, చిరంజీవి కుటుంబాలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అండగా నిలబడ్డాయని తెలుస్తోంది. మారిన టెక్నాలజీ రీత్యా హైదరాబాద్‌లో వున్న పవన్ కళ్యాణ్ ఆన్‌లైన్‌లో వాకబు చేసి వుంటాడని సన్నిహితులు చెబుతున్నారు. అంతేకానీ హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్ళడం వెనుక కూడా పలు కారణాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఆయన చట్టానికి ఎవరూ అతీతులు కారని, అదే తన అజెండా అని పలురకరాలుగా పలువురిని విమర్శించిన సందర్భాలున్నాయి. తప్పు ఎవరు చేసినా వదిలేది లేదనేది కూడా జనసేన పార్టీ ఉద్దేశ్యం. అందులోనూ ఓ మహిళ చావుకు కారకులైన 11వ ముద్దాయి అయిన అల్లు అర్జున్‌ను పలుకరించడం ఆయన పదవికే ఎసరు కాగలదని పలువురు తెలియజేస్తున్నారు.  అందులోనూ చంద్రబాబు మంత్రివర్గంలో వుండటంతో రాజకీయ అంశాలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
 
సంధ్య థియేటర్లో ఏమి జరిగింది? అనేది పోలీసులు వెర్షన్, థియేటర్ యాజమాన్యం వెర్షన్ విరుద్ధంగా వున్నాయి. అల్లు అర్జున్ వాదన కూడా వేరుగా వుంది. కనుక ఏది నిజం? అనేది తెలియజేయడానికి కేసు కోర్టులో వుంది. ఇలాంటి సమయంలో దాని గురించి చర్చించరు. పైగా పవన్ కళ్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదు. లేనిపోని అభాండాలు ఆయన ఆపాదించుకున్నవారవుతారు. సహజంగా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు, మనస్పర్థలు మామూలే. కానీ కష్టకాలంలో అండగా వచ్చి అందరూ నిలబడి ధైర్యం నూరిపోయడం కూడా అంతే సహజం. కానీ ఇందుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా మినహాయింపు కిందకు వస్తాడు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి ఏదోవిధంగా పరిష్కారానికి చేయగలడు. కానీ చట్టం తనపని తాను చేయాలి కాబట్టి అటువంటి అడుగులు పవన్ వేయడని సన్నిహితులు తెలియజేస్తున్నారు.
 
ఇక ఈరోజు జరిగిన పరిణామాల వల్ల అమెరికాలో గేమ్ ఛేంజర్ వేడుక నుంచి వచ్చిన నిర్మాత దిల్ రాజు ఓ విషయాన్ని ప్రస్తావించారు. రేవతి కుటుంబాన్ని అండగా వుంటామనీ, ఆమె భర్త భాస్కర్‌కు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు అందుకు పెద్దల సహకారంతో ముందడుగు వేయనున్నట్లు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి దిల్ రాజు చెప్పేదానిలో వాస్తవం వుంటుందని అందరూ భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు