గోదావరి జిల్లాల్లో దొరుకుతున్న పులస చేప... కిలో రూ.10 వేలే
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:20 IST)
ఉభయ గోదావరి జిల్లాలో స్వచ్ఛమైన గోదావరిలో దొరికే పులస చేప అంటే.. ఎంతో క్రేజ్! ముఖ్యంగా ధవళేశ్వరం వద్ద ఇవి దొరుకుతాయి. వీటిని కొనడం కోసం వ్యాపారులు, కొనుగోలుదారులు పడిగాపులు కాస్తారు.
చూపుకు చిన్నదే అయినా బరువులో మాత్రం తక్కువేం కాదు. చిన్నగా కనిపించే చేప కూడా తక్కువలో తక్కువగా కెజి తూకుతుంది. రేటు ఇంతకుముందు కిలో 2, 3 వేల రూపాయలుండేది. ఇప్పుడు ఏకంగా రూ.10 వేలు దాటేస్తోంది.
పులస దొరుకుతున్నదాని బట్టి రేటు మారిపోతుంటుంది. ప్రస్తుతం రూ.7 వేల నుండి రూ.10 వేల వరకు పులస రేటు పలుకుతోంది. ఈ పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది.
భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువు తూగింది. కొనుగోలుదారుల హడావిడి పెరిగింది. పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసిపి నేత, నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి ఈ బంగారు చేపను చేజిక్కించుకున్నారు.