ఉప ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ తిరుపతిలో రాజకీయ వేడి రాజుకుంది. మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు తిరుపతిలో మకాం వేసి ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటే ఈసారి ఏకంగా మూడు ప్రధాన పార్టీల మధ్య కనిపిస్తోంది.
అందులో ఒకటి వైసిపి, మరొకటి టిడిపి, అలాగే బిజెపి. బిజెపి నుంచి అభ్యర్థిని ప్రకటించకముందే ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలందరూ తిరుపతిలోనే మకాం వేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఇక టిడిపి, వైసిపి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు.
టిడిపి నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించారు. ఆమె ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా ప్రారంభించేశారు. ఇక వైసిపి అభ్యర్థి గురుమూర్తి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే బిజెపి ముఖ్య నేతలు తిరుపతిలో ఉండడం అందులోను ఎన్టీఆర్ కుమార్తె పురందరేశ్వరి ఉప ఎన్నికల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
తిరుపతిలో పార్లమెంటు పరిధికి సంబంధించిన ఏడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు పురందరేశ్వరి. పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఆ తరువాత మీడియాతో పురందరేశ్వరి మాట్లాడుతూ ఎపిలో నిర్మాణాత్మక అభివృద్ధి జరగడం లేదన్నారు. 2 వేల కోట్లతో 52 ప్రాజెక్టులను కేంద్ర నిధులతో తిరుపతిలో చేపట్టామన్నారు.
తిరుపతి మరింత అభివృద్ధి జరగాలంటే బిజెపితోనే సాధ్యమన్నారు. బిజెపి ఎంపినే తిరుపతిలో గెలిపించాలని ప్రజలను కోరారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తిరుపతిలో వేల సంఖ్యలో గుర్తించామని.. ఎస్ఈసి దృష్టికి నకిలీ గుర్తింపు కార్డుల విషయాన్ని తీసుకెళతామన్నారు. జనసేనతో కలిసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని.. జనసేనతో విడిపోయామని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఎపికి కేంద్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు పురందరేశ్వరి.