అమెరికాలో జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ దాడి తదనంతర పరిణామాలు నేపథ్యంలో ట్విటర్, ఫేస్‌బుక్ సహా ఇతర వేదికల నుంచి ట్రంప్ నిషేధానికి దారి తీశాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నది అధ్యక్షుడుగా కాదు.. సామాజిక మాధ్యమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదేంటి ట్విటర్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిషేధించాయి కదా! మళ్లీ ఎలా వస్తారనేగా మీ అనుమానం.
అయితే, ట్రంప్ ఈ సారి తనను తొలగించిన వేదికల నుంచి కాకుండా.. తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నారని సమాచారం. రెండు లేదా మూడు నెలల్లో ఆ నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.