మే నెలకు 13 లక్షల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు: అనిల్ కుమార్ సింఘాల్
శనివారం, 1 మే 2021 (10:25 IST)
కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మే నెలకు సంబంధించి 13 లక్షల వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వాటిలో 9,91,700 కొవిషీల్డ్, 3,43,930 కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయబోతున్నామన్నారు.
మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 24 గంటల్లో 86.494 కొవిడ్ శాంపిళ్లు టెస్టు చేయగా, 17,354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. 64 మరణాలు సంభవించాయన్నారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,63,90,360 టెస్టులు చేయగా, 11,01, 690 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.
పాజిటివ్ కేసుల నమోదు శాతం 6.72 శాతంగా ఉందన్నారు. రోజు వారీగా చూస్తే గత 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,291 రిమిడె సివిర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో వివిధ కంపెనీలకు చెందిన 9,646 రిమిడె సివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కొనుగోలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 5,645 ఇంజక్షలను అందజేసిందన్నారు.
గురువారం(29.4.2021) నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో 29 వేల రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు అందివ్వగా, నేడు 30,559 ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు. మొదటి కేసుల వచ్చిన వారందరూ ఆసుపత్రుల్లో చేరిపోయారన్నారు. ఎక్కువ లక్షణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని, తక్కువ లక్షణాలున్నవాకికి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు.
104 కాల్ సెంటర్‌కు పెరిగిన తాకిడి...
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేశామని, సిబ్బందని నియమించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో శుక్రవారం అధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ ను 104 సెంటర్ నిర్వాహాకులు స్వీకరించారన్నారు.
గతంలో రోజుకు 7 వేలు కాల్స్ రాగా, నేడు(30.4.2021) 15 వేల కాల్స్ 104 కాల్ సెంటర్‌కు వచ్చాయన్నారు. వాటిలో 3,698 టెస్టుల కోసం, 3,183 ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న బంధుల సమాచారం కోసం వచ్చాయన్నారు. 2,672 కొవిడ్ టెస్టు రిజల్ట్ కోసం రాగా, 936 వ్యాక్సినేషన్ నిమిత్తం వచ్చాయన్నారు. టెలీ కాల్ సెంటర్ కు 2,612 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. హోం ఐసోలేషన్ పేషంట్లకు కూడా టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు, సలహాలు సూచనలు అందిస్తున్నామన్నారు.
హోం ఐసోలేషన్లో ఉండే బాధితుల కోసం ఐఏఎస్ అధికారి నియామకం...
హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో హోం ఐసోలేషన్ ఐఏఎస్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారికి కిట్లు అందాయా..? మందులు అందుతున్నాయా...? ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోడానికి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పరామర్శిస్తున్నారా..? అనేవిషయాన్ని రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారి పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.
సొంతంగా ట్యాంకర్ల కొనుగోలు...
కరోనా బాధితులకు తక్షణమే ఆక్సిజన్ ను అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం అధికారులతో చర్చించి, శనివారం పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. గడిచిన 24 గంటల్లో 437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సప్లయ్ చేశామన్నారు. రోజు వారీగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 470 టన్నులను కేటాయించిందన్నారు. ఈ కేటాయింపులు మరింత పెంచాలని కోరుతున్నామన్నారు.
ఇదే విషయం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నామన్నారు. ఆ సమావేశంలో తమ ఇండెంట్ పెంచాలని కోరనున్నామని ఆయన తెలిపారు. పెట్రోలియం కంపెనీలకు చెందిన ట్యాంకర్లను లిక్విడ్ ఆక్సిజన్ రవాణాకు వినియోగించుకోవాలని నేడు(శుక్రవారం) నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ కమిటీ ఆదేశించిందన్నారు. ఈ సమావేశంలో దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాలకు 9 ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వ కమిటీ కేటాయించగా, వాటిలో 2 ట్యాంకర్లను ఆంధ్రాకు అందజేయనుందన్నారు. త్వరలో ఈ రెండు ట్యాంకర్లు అందుబాటులో రానున్నాయన్నారు.
కొవిడ్ కేర్ సెంటర్లలో పెరుగుతున్న బాధితుల సంఖ్య...
రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేశామని ఆయన వెల్లడించారు. చిత్తూరులో 6 కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించగా, అందులో 2,636 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. గుంటూరులో 1,376 మంది, కర్నూలులో 1,313 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారన్నారు. ప్రతి జిల్లాలోనూ కొవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్ల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 7,749 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారన్నారు. వచ్చే రెండ్రోజుల్లో ఈ సంఖ్య 15 వేల మందికి చేరుకోచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతోందన్నారు.
మే నెలలో 13 లక్షల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు...
కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మే నెలలో 9,91,700 కొవిషీల్డ్ డోసులు, 3,43,930 కోవాగ్జిన్ వాక్సిన్ల డోసులను...మొత్తం 13 లక్షలకు పైగా డోసులను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయనుందన్నారు. ఆ రెండు కంపెనీలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే కొనుగోలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ధరల విషయం ఆ రెండు కంపెనీలతో ఇంకా చర్చించలేదన్నారు.
వ్యాక్సినేషన్ లో 45 ఏళ్లు పైడిన వారికే ప్రాధాన్యత
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్ ను 45 ఏళ్ల పైబడిన వారికి వినియోగిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు కోటీ 48 లక్షల మంది ఉన్నారన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వారు 2 కోట్లా 4 లక్షల మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరవాతే ఇతరులకు వ్యాక్సిన్ వేయాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు. ఇదే విషయమై పీఎం నరేంద్రమోడికి సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. మే ఫస్ట్ నుంచి 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడంలేదన్నారు.