ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విశృలంఖలంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మే 5వ తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనుంది. అయితే, కరోనా సునామీ ప్రబలిపోతున్న వేళ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టులో విచారణ జరిగింది.
పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించాలని ఏపీ సర్కారుని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపింది. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని గుర్తుచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
మరోవైపు వచ్చే నెల 5వ తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. వెబ్‌సైట్లో గురువారం నుంచే విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు పరీక్షల సామగ్రి చేరుతోందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక పరీక్షా కేంద్రాలు, గుంటూరు జిల్లాలో తక్కువ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
పరీక్షల నిర్వహణ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరసా ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మొబైల్ మెడికల్ వ్యానులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ అధికారి ఉంటారని చెప్పారు.