ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం కూడా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింద. విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. అదేసమయంలో అన్నమయ్య జిల్లా, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే, వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. గత కొంతకాలంగా ద్వారంపూడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న పవన్... ద్వారంపూడిని మాఫియా డాన్‌గా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ కళ్యాణ్ రోడ్‌షో పాటు బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే, ద్వారంపూడి తన అధికారాన్ని ఉపయోగించి పవన్ సభలకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్‌షో, సభకు టీడీపీ, జనసేనలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే, అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ అనుమతి ఇవ్వలేదు.
దీంతో పవన్ పర్యటన రూట్ మార్చి ఎనిమిది ప్రాంతాల్లో దరఖాస్తు చేసినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైకాపా అధికార దుర్వినియోగం, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు. అనుమతుల కోసం అర్థరాత్రి 12 గంటల వరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు పడిగాపులు కాశారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి కారణం... కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే తాను చిత్తుగా ఓడిపోతానన్న భయం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలో బలంగా పాతుకుపోయింది. దీంతో తన అధికార బలంతో కాకినాడలో పవన్ పర్యటనకు రాకుండా అడ్డుకుంటున్నారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.