హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి నుంచి బయటకు అడుగేసేందుకు ప్రజలు జడుసుకుంటున్నారు. దీంతో మందుబాబులు కూడా ఇంటికే పరిమితమైపోతున్నారు. భారీ వర్షాలతో మందుబాబులు చుక్కేసేందుకు కాలు బయటపెట్టట్లేదు. మద్యం అమ్మకాలతో భారీగా రెవెన్యూ తెచ్చిపెట్టే హైదరాబాద్ వర్షం దెబ్బకు అతలాకుతలమైంది.
మద్యం ప్రియుల కొనుగోలు తగ్గిపోవడంతో పాటున మద్యం సరఫరా చేయడానికి కూడా రవాణా సౌకర్యం లేక రెవెన్యూ పడిపోయిందని తెలంగాణ వైన్ డీలర్ అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాగా, 2016-17 సంత్సరానికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.4318కోట్ల రెవెన్యూ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆగస్టు వరకు రూ. 2,044కోట్ల మేర రెవెన్యూ సమకూరింది. అయితే ఈ యేడాది ఆగస్టు పండగ సీజన్‌లో 20శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు.