ఈ వివరాలను పరిశీలిస్తే, రాజమండ్రి అర్బన్ కడియం మండలానికి చెందిన గుబ్బల వెంకటరమణ (35)కు జ్యోతి అనే మహిళతో వివాహమైంది. జ్యోతికి ఓ నర్సరీలో పని చేసే సతీష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ విషయం భర్తకు తెలిసి ఇద్దరినీ పిలిచి మందలించారు. దీంతో భర్తపై కసి పెంచుకున్న జ్యోతి.. తన ప్రియుడు సతీష్‌తో కలిసి చంపాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన స్నేహితురాలు నాగదేవి సాయం తీసుకుంది.
తమ ప్లాన్‌లో భాగంగా, కట్టుకున్న భర్తకు నాగదేవితో ఫోన్ చేయించింది.. "నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడాలని వుంది. నేను కారు పంపిస్తాను. ఎక్కిరా. నేను ఉన్న చోటుకు డ్రైవర్ నిన్ను తీసుకొస్తాడంటూ" ఆప్యాయంగా మాట్లాడింది. ఈ మాటలు నమ్మిన వెంకటరమణ కారులో ఎక్కి వెళ్లాడు.
ఆ కారు నేరుగా స్థానికంగా ఉండే ఓ కొబ్బరితోటలోకి వెళ్లి ఆగింది. అక్కడ సిద్ధంగా ఉన్న జ్యోతి, సతీష్, నాగదేవిలు ఒక్కసారిగా దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
మరుసటిరోజు వెళ్లి మృతదేహాన్ని తోటలోనే పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. అపుడు తోట యజమాని దుర్గాప్రసాద్ చూసి సతీష్‌ను నిలదీశాడు. దీంతో విషయం చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. దుర్గాప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఈ హత్యతో సంబంధం ఉన్న ఐదుగురుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.