Pavala Shyamala: క్షీణిస్తున్న సీనియర్ న‌టి పావలా శ్యామల ఆరోగ్యం - కూతురికి అనారోగ్యం

చిత్రాసేన్

శనివారం, 18 అక్టోబరు 2025 (16:23 IST)
Pavala Shyamala admitted to hospital
రంగస్థలంలో పలు పాత్రలతో అలరించిన పావలా శ్యామల  వెండితెరపై పలు పాత్రలను పోషించింది. ప్రేక్షకులను నవ్వించిన ఆ పెదవులు ఇప్పుడు సాయం కోసం ఆర్థిస్తున్నాయి. నిన్నటివరకు ప్రేక్ష‌కుల‌ను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల ఇప్పుడు ఆస్పత్రిలో కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆమె జీవితపు చివ‌రి ద‌శ చిగురుటాకులా వ‌ణికిపోతోంది. గతంలో ఆమెకు అనారోగ్యం రాగా పవన్ కళ్యాణ్ తోపాటు పలువురు ప్రముఖులు ఆమెకు సాయం చేశారు. అయితే నేడు ఆమె ఆరోగ్య మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పావలా శ్యామల అంటే చాలు.. ఆ పాత్ర‌కు ప్రాణం పోసే నటిగా ప్ర‌త్యేక గుర్తింపు ఉండేది. పేదరికం నుంచి ప్రారంభమైన ఆమె జీవితం, తన నటనతో మల్టీ స్టార్ సినిమాల్లో చోటు సంపాదించింది. కామెడీ, భావోద్వేగం రెండింటినీ కలిపి చూపగలిగిన అరుదైన నటీమణులలో ఆమె ఒకరు. “అమ్మ” పాత్రల్లోనూ, అత్త పాత్రల్లోనూ, “పక్కింటి అక్క”గా కూడా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
 
కానీ ఇప్పుడు...
ఆ వెలుగులు మసకబారాయి. ఆరోగ్యం క్షీణించింది. ఆర్థికంగా కుదేలైన పరిస్థితిలో రోజులు గడపలేకపోతోంది. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉన్న ఆమె, జీవనాధారం లేక చివరకు అనాథాశ్రమంలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్క‌డి నుంచి ఇప్పుడు ఆస్పత్రిలో చేరి సాయం కోసం ఎదురు చూస్తోంది. తన కూతురు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైపోవడంతో, శ్యామల మనసు మరింతగా విరిగిపోయింది. “ఇప్పుడైనా ఎవరో మనసున్నవాళ్లు నా కూతురికి, నాకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా…” అంటూ ఆమె ఆస్పత్రి బెడ్‌పై నుంచి చెప్పిన మాటలు ఎవరి మనసునైనా కదిలిస్తాయి.
 
జీవితమంతా ప్రేక్షకుల నవ్వుల కోసం కష్టపడి, ఇప్పుడు ఆ నటి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం ఎంతో బాధాకరం. వందలాది పాత్రల్లో మనకు చిరునవ్వులు పంచిన పావలా శ్యామల, ఈరోజు ఒక్క జీవనాధారం కోసం ఎదురుచూస్తోంది. త‌న‌కు, త‌న కూతురికి కాసింత అన్నం, మందుల కోసం వ‌ణికిపోతున్న చేతులను జోడించి సాయం కోరుతోంది. మ‌న‌సున్న ద‌యా హృద‌యుల కోసం దీనంగా ఎదురు చూస్తోంది. సాయం చేసే వారు  Neti Shyamala : 98491 75713 నంబ‌ర్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు