రాజకీయం గురించి మాట్లాడాలని వుంది.. కానీ, వద్దురా రజనీ అని అనుభవం ఆపుతోంది.. తలైవా

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (21:55 IST)
రాజకీయాల గురించి మాట్లాడాలని వుందని, కానీ, వద్దురా రజనీ అని అనుభవం చెబుతోంది అని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. విజయవాడ వేదికగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇలాంటి భారీ వేడుకల్లో నేను తెలుగు మాట్లాడి చాలా రోజులైందన్నారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలని సభికులను కోరారు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో జ్ఞానం చెబుతుందని, ఎంత సేపు మాట్లాడాలనేది సభ చెబుతుందని, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుందన్నారు. మీ అందరినీ ఇలా చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తుంది. కానీ, 'వద్దురా రజనీ' అని తన అనుభవం చెబుతుందన్నారు.
 
'నా ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంచెమైనా పాలిటిక్స్‌ గురించి మాట్లాడకపోతే సరికాదు. ఆయన నా మిత్రుడు. నాకు ఆయనతో 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. చంద్రబాబు నాయుడుని నా మిత్రుడు మోహన్‌ బాబు పరిచయం చేశారు. 'త్వరలోనే పెద్ద నాయకుడు అవుతాడు' అని ఆ సమయంలోనే చంద్రబాబు గురించి నాతో చెప్పారు అని గుర్తుచేశారు. 
 
పలు సందర్భాల్లో చంద్రబాబుని కలిసి ఆయనతో మాట్లాడితే నా జ్ఞానం పెరిగింది. 24 గంటలూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. ఇండియా పాలిటిక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌ పాలిటిక్స్‌ కూడా ఆయనకు తెలుసు. చంద్రబాబు ఘనత పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసు. ఐటీ గురించి ఎవరికీ తెలియని రోజుల్లో భవిష్యత్తు దానిదే అని చెప్పారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారు. 
 
బిల్‌గేట్స్‌లాంటి వాళ్లెందరో ఆయన్ను ప్రశంసించారు. లక్షలాది మంది ఇప్పుడు ఐటీ రంగంలో పనిచేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు గారే. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను చూసినప్పుడు భారత్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అనేది నాకు అర్థంకాలేదు. దూరదృష్టితో ఆయన వేసిన ప్లాన్‌ '2047' అనుకున్నట్టు అమలైతే ఆంధ్రప్రదేశ్‌ స్థానం ఎక్కడికో వెళ్లిపోతుంది అని ఆశాభావం వ్యక్తంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు