వర్షాకాలంలోనూ వేగం తగ్గకుండా రీ-సర్వే పనులు

బుధవారం, 27 జులై 2022 (22:54 IST)
వర్షాకాల పరిస్థితులను అధికమిస్తూ రీసర్వే పనులలో వేగం తగ్గకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసి ఉందని సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ శాఖ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా అధికవర్షాలు, గాలుల సమయంలో డ్రోన్ ఎగరటంతో సహా పలు రీసర్వే పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు వాటిని అధికమించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

 
విజయవాడ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆవరణలో రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అధికారులు జగనన్న రీసర్వే ప్రాజెక్టు అమలుపై సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో బుధవారం ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సర్వే ఆఫ్ ఇండియా ఎపిజిడిసి సంచాలకులు శ్యామ్ వీర్ సింగ్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ , ప్రత్యేక అధికారి అజయ్ కుమార్ నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనగా విభిన్న అంశాలపై లోతుగా చర్చించారు. రీసర్వే ప్రాజెక్టులో భాగంగా సర్వే ఆఫ్ ఇండియాకు 45,305 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వే కోసం అప్పగించగా, పెండింగ్ పనులను రానున్న ఐదు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని నిర్ణయించారు.

 
ఈ క్రమంలో ఐదువేల ఐదు వందల గ్రామాల పనులు డిసెంబరు నాటికి పూర్తి కావలసి ఉండగా, ఇప్పటికే 2,830 గ్రామాలలో పనులు పూర్తి అయిన విషయాన్ని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రీసర్వే ప్రాజెక్టు కోసం 21 డ్రోన్లు పనిచేస్తుండగా, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు మరిన్ని డ్రోన్లు సమకూర్చుకోవాలని నిర్ణయించామని సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ తెలిపారు.
 
వచ్చే నెలాఖరునాటికి నూతనంగా 10 డ్రోన్లు సమకూర్చుకునేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. సమీక్ష సమావేశంలో పర్యవేక్షక సర్వేయర్లు పంకజ్ కుమర్, మేజర్ సురభ్ ధీర్, ఉప పర్యవేక్షక సర్వేయర్లు దీపక్ భార్తి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఠక్కర్, కార్యక్రమ మేనేజర్లు అంకూర్, రఘు, సెబాస్టియన్, కమీషనరేట్ నుండి సంయిక్త సంచాలకులు ప్రభాకరరావు, ఉప సంచాలకులు ఝూన్సి రాణి, సహాయ సంచాలకులు కుమార్, శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర సర్వే అకాడమీ వైస్ ప్రినిపల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు