రాష్ట్ర మంత్రివర్గ పునర్యవ్యస్థీకరణలో భాగంగా పదవిని పోగొట్టుకున్న సీనియర్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తనను మంత్రి పదవినుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్త వ్యక్తంచేసిన బొజ్జల ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ఏ మాత్రం జాగు చేయకుండా తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు, ముఖ్యమంత్రికి పంపించారు.
అలిపిరి బాంబుదాడిలో నక్సలైట్ల మందుపాతర నుంచి తృటిలో చంద్రబాబు తప్పించుకున్నప్పుడు కారులో ఆయన పక్కనే కూర్చున్నంత సాన్నిహిత్యం బొజ్జలది. అలాంటి తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై బొజ్జలతో పాటు పలువురు ఆశావహులు కూడా అసంతృప్తితో ఉన్నారు. కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో రామసుబ్బారెడ్డి వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది.