సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సుందరకాండ 20 నుండి 24వ సర్గ వరకు ఉన్న మొత్తం 185 శ్లోకాలతో 6వ విడత అఖండ పారాయణం నిర్వహించినట్లు టిటిడి ఈవో డా.కె.ఎస్. జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం జరిగిన సుందరకాండ అఖండ పారాయణంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై "సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత పారాయణం"లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను తిరుమలలో నిరంతరం కొనసాగించనున్నట్లు ఈవో తెలియజేశారు.
అఖండ పారాయణంలో దాదాపు 300 మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నట్లు వివరించారు.
సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ ప్రజల యోగ క్షేమం కొరకు టిటిడి 208 రోజులుగా శ్రీవారి అనుగ్రహంతో మంత్ర పారాయణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణం చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వివరించారు.