ఠంచనుగా ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న సీఎం చంద్రబాబు!!

వరుణ్

శనివారం, 15 జూన్ 2024 (11:22 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఇకపై ఠంచనుగా ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్నారు. ఆయన అక్కడే సాయంత్రం 6 గంటల వరకు ఉండి రోజువారీ విధులు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ఆయన... గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. గతంలో వ్యవహరించిన విధంగానే ఈసారి కూడా సచివాలయంలోనే నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్టు ఆయన చెప్పారని తెలుస్తోంది.
 
మరోవైపు, సచివాలయం నుంచి పాలన అందించాలని నిర్ణయించన సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు ప్రతి రోజూ సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు