ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను రోడ్డు పక్కనే ఖననం చేశారు. ఈ ఖననం చేసిన తర్వాత చేతి గ్లౌజులు, పీపీఈ కిట్లను కూడా అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. వీటివల్ల ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు.
పట్టణంలోని ప్రజా నగర్, వెంకన్న బావి, దిన్నదేవరపాడు గ్రామాలకు చెందిన ప్రజలు అందించిన సమాచారం మేరకు.. కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను అధికారులు శ్మశానవాటికల్లో కాకుండా, జాతీయ రహదారుల పక్కన పూడ్చిపెడుతున్నారని చెప్పారు.
పైగా వారు ధరించిన పీపీఈ కిట్స్, చేతి గ్లౌజులు కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. వాస్తవానికి వీటిని కాల్చివేయాల్సివుంది. అధికారుల నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ఈ వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.