గత వైకాపా ప్రభుత్వంలో రూ.35000 కోట్ల మేరకు మద్యం స్కామ్ జరిగినట్టు గుర్తించారు. ఈ మద్యం కుంభకోణంలో రోజుకు ఒక కొత్త కోణం బయటపడుతోంది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో అక్రమ మద్యం నగదు డంప్‌ను గుర్తించారు. లిక్కర్ స్కామ్‌లో ఏ-40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెల్లడయ్యాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది.
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్‌కు చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది.