తెలంగాణ ప్రాంతం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు రావాలనుకొనే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం దసరా నాటికైనా బస్సులు తిరిగితే సొంత ఊళ్ళకు రావాలనుకొన్నవారికి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరాశ కలిగించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకొన్నవారికి రవాణా సదుపాయం లేకుండాపోయింది. తమకు కావల్సినవారికి అత్యవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించే ప్రభుత్వం- పేదల కోసం బస్సులు నడపలేకపోతోంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగకపోవడం వల్ల ఎదురవుతున్న ఇక్కట్లను పలువురు పార్టీ దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 1281 బస్సులు నడిచేవి. ఇప్పుడు ఒక్క బస్సు కూడా తిరగటం లేదు. అదే విధంగా రైల్వే సేవలూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలోనే ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంచితే ప్రయోజనకరంగా ఉండేది.