"భారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదు".. ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు. ఆయన తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్.
ఆయన ఇంకేమన్నారంటే... "ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు. దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రజలకు విరుద్ధంగా ఉంది. దేశంలోని పోలీస్ అకాడమీలన్నీ డంపింగ్ యార్డ్‌లుగా మారాయి. ఈ అకాడమీలో పోలీసులు తీసుకుంటున్న శిక్షణ వల్ల సమజానికి ఎలాంటి ఉపయోగం లేదు. పోలీసులు సామాజిక కార్యకర్తలుగా వ్యవహరించాలి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు.
బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే ఇప్పటికీ కొనసాగుతోంది. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదు.. చట్టానికి, న్యాయానికి మాత్రమే జవాబుదారీ. అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ లెవల్‌కు లింకై ఉండాలి. పోలీస్ శిక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. కానీ దానివల్ల ఎలాంటి లాభం లేదు. పోలీస్ శిక్షణ కేంద్రాలు కాలేజ్‌లు, స్కూళ్లు కావు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలనేది శిక్షణలో నేర్పించాలి.
పోలీసులు చెప్పిన మాట ప్రజలు వింటున్నారు. అయినా, ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు. దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రజలకు విరుద్ధంగా ఉంది. దేశంలో ఎంతమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రజల నుంచి ప్రశంసలు లభించడం లేదు" అని సంచలన కామెంట్లు చేశారు వీకే సింగ్.