ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చర్యలు ప్రమాదకరంగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) మాజీ కమిషనర్, ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజెన్స్ ఫోరం చైర్మన్ విజయబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డకు అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ద్వారా నోటీసులివ్వాలని, కమిటీ ముందుకు రాకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య పరిణామాలపై విజయవాడలో చర్చాగోష్టి నిర్వహించారు.
విజయబాబు మాట్లాడుతూ.. కోర్టు తీర్పు తర్వాత తాను ఏం చేసినా చెల్లుతుందనేలా నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ వ్యవహారం కక్ష సాధింపు చర్యగా ఉందని మండిపడ్డారు. మంత్రులకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రవీణ్ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలనడం ద్వారా నిమ్మగడ్డ తన పరిధిని అతిక్రమించారన్నారు.
ప్రజా పరిపాలనకు ఆయన అవరోధం సృష్టిస్తున్నారన్నారు. ఇలాగే ఒకప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకపోతే.. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆయన్ను అరెస్ట్ చేయాలని నిర్ణయించిందన్నారు. గవర్నర్, కోర్టును సంప్రదించడానికి కూడా సమయం ఇవ్వకుండానే అరెస్టు చేయించిందని గుర్తుచేశారు.