పోస్టాఫీసుల్లోనూ స్టాంప్‌ పేపర్ల అమ్మకాలు

శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:48 IST)
రాష్ట్రంలో నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్స్‌ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్‌ పేపర్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్‌ వెండార్స్‌ ప్రజలకు వీటిని అమ్ముతున్నారు.

కొన్నిసార్లు ఈ స్టాంప్‌ పేపర్స్‌కు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా వీటికి డిమాండ్‌ పెంచి.. బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్‌ పేపర్స్‌ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం మండల స్థాయి పోస్టాఫీసుల్లో స్టాంప్‌ పేపర్స్‌ అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో 700 పోస్టాఫీసులకు, రెండో దశలో మిగిలిన 868 పోస్టాఫీసులకు లైసెన్సులు ఇస్తారు.

మూడో దశలో గ్రామస్థాయి పోస్టాఫీసుల్లో విక్రయానికి పెట్టనున్నారు. రూ.15 కోట్ల విలువైన స్టాంప్‌ పేపర్స్‌ ఒకటి, రెండు దశల్లో పోస్టాఫీసుల ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు