ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

శుక్రవారం, 8 నవంబరు 2019 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇసుక లేనికారణంగా భవన నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కూలీ పనులు లేక, ఉపాధి గడవక పోవడంతో పలువురు నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
ఏపీ సర్కారు ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షి చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులను, మున్సిపల్‌ కమిషనర్‌ను టీడీపీ నేతలు కోరారు. 
 
అయితే స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదంటూ అధికారులు తోసిపుచ్చారు. ఇదిలావుంటే, ప్రభుత్వం అనుమతి నిరాకరించినా చంద్రబాబు దీక్ష జరిగి తీరుతుందని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నేతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ధర్నాచౌక్‌ను ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.
 
కాగా, రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా ఈనెల 3న విశాఖలో లాంగ్‌మార్చ్‌ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి విపక్ష పార్టీలన్నీ కలిసివచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఈనెల 14న ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ శ్రేణులు దీక్షకు అనుకూలమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు