పందెం కోళ్లు... పొద్దున్నుంచే దినచర్య... వడ్డించే ఆహారం ఇదే... వైన్ కూడా

శుక్రవారం, 3 జనవరి 2020 (13:05 IST)
సంక్రాంతి సంబరాల్లో హైలెట్ కోడిపందాలు. ఈ పందాల కోసం కోడిపుంజులను ఆర్నెల్ల ముందు నుంచే సిద్ధం చేస్తుంటారు. ముఖ్యంగా, పందెం కోళ్ళ పెంపకమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కోళ్ళ దినచర్య ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభమవుతుంది. అలాగే, వాటికి వడ్డించే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. 
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో కోడిపందాలకు అవసరమైన కోడిపుంజులను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే, బరిలో దిగే పుంజులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ  డేగకు మాత్రం చాలా డిమాండ్ ఉంది. 
 
సాధారణంగా నెమలి, కొక్కిరాయి, డేగ, రసంగి, పర్ల, పచ్చకాకి, తీతువా, గౌడ నెమలి, సేతువ, మైలా, పింగళ, కాకి, నల్లబొట్ల తీతువా, అబ్రాస్‌ వంటి పుంజులను పందాలకు వాడుతుంటారు. వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వీటిల్లో డేగ రకంపై అటు పందెం రాయుళ్లు, ఇటు నిర్వాహకులు ఆశలు పెంచుకుంటున్నారు. 
 
ఈ డేగ పుంజులను పెంచే విధానం కూడా ఓ ప్రత్యేకతను కలిగివుంటుంది. ఇవి చాలా బలంగా, చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి దినచర్య ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది. తెల్లారగానే వీటిని నీళ్లల్లో ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తారు. ఆపై 7 గంటల నుంచి ఒక్కో పుంజుకు 10 బాదం పప్పులు, నల్లద్రాక్ష, తాటి బెల్లం, ఎండు ఖర్జూరం, నల్లనువ్వులు కలిపి తయారు చేసిన నువ్వుల ఉండలను ప్రతి గంటకు ఒకటి చొప్పున తినిపిస్తారు. 
 
ఆ తర్వాత మధ్యాహ్నం 50 గ్రాముల మటన్, జీడిపప్పు కలిపిన ఆహారాన్ని వీటికి పెడతారు. సాయంత్రం పూట సోళ్లు, సజ్జలు, వడ్లతో పాటు గుడ్డును ఆహారంగా అందిస్తారు. మరికొన్ని ఎంపిక చేసుకున్న డేగలకు కొందరు మద్యం (వైన్) కూడా తాగిస్తారు. ఇంకొంతమంది వాటి కండలను పెంచేందుకు, తిన్నది అరిగేందుకు లీవ్‌ 52 సిరప్, న్యూరోబియాన్ టాబ్లెట్లను కూడా ఇస్తుంటారు. 
 
ఇందుకోసం ఒక్కో పుంజుకు రోజుకు రూ.200 వరకూ ఖర్చు అవుతుంది. అంటే, మొత్తం మీద మూడు నెలల వ్యవధిలో దాదాపు 18 నుంచి 20 వేల వరకూ కోళ్ల పెంపకంపై ఖర్చు చేసే పెంపకందారులు, వాటిని రూ.లక్ష వరకూ అమ్ముతుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు