#SaveNallaMala యురేనియం తవ్వకాలపై నిషేధంపై తీర్మానం

సోమవారం, 16 సెప్టెంబరు 2019 (12:28 IST)
సేవ నల్లమల ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. ఫలితంగా ప్రభుత్వం కూడా వెనుకడుగు వేసింది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నల్లమల కేవలం అడవే కాదు... తెలంగాణ ప్రజల ఆస్తి, అస్తిత్వం అని తెలిపారు. అడవి నుంచి పూచిక పుల్లను కూడా ముట్టనియ్యం. కేంద్రం బలవంతం చేస్తే పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 
 
అంతకుముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విధంగా భరోసా ఇచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్న అంశంపై తెలంగాణలోని పలు పార్టీల నేతలు మండిపడటంతో కేసీఆర్ స్పందించారు. యురేనియం తవ్వకాలపై ఎవరికీ ఎలాంటి అనుమతి తమ ప్రభుత్వం ఇవ్వలేదని, భవిష్యత్‌లో కూడా ఇవ్వమని స్పష్టం చేశారు. 
 
ఈ అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రేపటి సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. ఆ పార్టీలాగా ఆడితప్పడం, మభ్యపెట్టడం లాంటివి తాము చేయలేదని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు