రూ.2713 కోట్లకు పెరిగిన ఎస్సీ కార్పోరేషన్ బడ్జెట్... జూపూడి, ఇన్నోవాలు ఇస్తున్నారు...

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (17:36 IST)
అమరావతి: ఈ ఏడాది ఏపీ ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ బడ్జెట్ రూ.2713 కోట్లకు పెరిగిందని కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల జీవన విధానంలో మార్పు కోసం, వారు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో పలు పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాబోయే తరాల భవిష్యత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు.
 
సివిల్ సప్లైస్ కార్పోరేషన్ వారి రేషన్ రవాణాకు ఉపయోగించే విధంగా 175 వాహనాలకు రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు వినియోగించే విధంగా రూ.1.50 లక్షల విలువైన బ్యాటరీ ఆపరేషన్ ట్రక్కులు 5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల కొనుగోలుకు కూడా వారికి రుణాలు ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులకు వినియోగించడానికి 500 ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ఈఎంఐ పంచాయతీరాజ్ శాఖ చెల్లిస్తుందని చెప్పారు. ఈ ఆలోచనలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబువిగా పేర్కొన్నారు. 
 
భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 4వేల ఎకరాల భూమి కొనుగోలు చేసి దళితులకు అందజేస్తుందని చెప్పారు. బాబా సాహేబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఆత్మగౌరవ నినాదంలో భాగంగా ఈ భూమిని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు పొందే విధంగా 3.27 లక్షల మంది దళిత యువతకు సాఫ్ట్వేర్, ఆంగ్ల భాష తదితర అంశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో కొందరికి ఆరోగ్య కార్యకర్తలుగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాకుండా 200 జెసీబీలు, ప్రొక్లెయినర్లు ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు