అనంతరం విద్యా శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. జూలై 15- ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదు, ఏ ఉపాధ్యాయ పోస్టు తగ్గదని హామీ ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
నాడు నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి వివరించారు. 30 శాతం పదో తరగతి, 70 శాతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామని, ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని ఆదిమూలపు సురేష్ చెప్పారు.