బస్సులో 1.35 కేజీల బంగారం పట్టివేత

శనివారం, 3 అక్టోబరు 2020 (09:12 IST)
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 1.35 కేజీల బంగారాన్ని శ్రీకాకుళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన కె.సంతోష్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో 1,351 గ్రాముల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో కలిసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంతోష్‌ కుమార్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడ్ని ప్రశ్నించామని.. ఈ క్రమంలో సంతోష్‌ వద్ద ఉన్న బ్యాగులో 1,351 గ్రాముల బంగారాన్ని గుర్తించినట్లు చెప్పారు.

పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా రసీదు లేని బంగారంగా సంతోష్‌ తెలిపాడన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఓ బంగారు ఆభరణాల దుకాణదారుడు ఆర్డర్‌ ఇవ్వగా తాను తీసుకొచ్చినట్లు అంగీకరించాడని సీఐ వివరించారు. ఈ బంగారం విలువ సుమారు రూ.65లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు.

సంతోష్‌ కుమార్‌ పర్లాకిమిడిలో ఓ బంగారం దుకాణంలో పనిచేసే వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేస్తామని సీఐ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు