విశాఖపట్టణంలో సెల్ఫీ సరదా ఓ ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు తీసింది. అరకులోయ సందర్శన కోసం విశాఖ నుంచి పాసింజర్ రైలులో వెళ్తూ మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జారి, 150 అడుగుల లోతున ఉన్న నదిలో పెద్ద బండరాయిపై పడటంతో ఈ విషాదం జరిగింది. హృదయ విదారకమైన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు సమీపంలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు అరకులోయ అందాలను వీక్షించేందుకు శనివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఆదివారం ఉదయం పాసింజర్ రైలులో అరకులోయ బయలుదేరారు. కబుర్లు చెప్పుకుంటూ, ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. గోపీరెడ్డి, మరో ఇద్దరు కలిసి బోగీ వాకిలి వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
కరకవలస - సిమిలిగుడ స్టేషన్ల మధ్య 87/17 కిలోమీటరు వద్ద గోస్తనీ నది ఉంది. ఈ నదిపై 150 అడుగుల ఎత్తులో రైలు వంతెన ఉంది. రైలు సరిగ్గా ఇక్కడకు వచ్చిన సమయంలో గోపీరెడ్డి పట్టుకోల్పోయి రైలులో నుంచి జారి నదిలో ఉన్న పెద్ద బండ రాయిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మిగిలిన విద్యార్థులతోపాటు బోగీలో ఉన్న పలువురు చైను లాగి రైలును ఆపారు. సమాచారం అందుకున్న అరకు ఆర్‌పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం నుంచి జీఆర్‌పీ పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.