వైఎస్ జగన్‌ను హత్య చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్??

ఠాగూర్

శనివారం, 2 ఆగస్టు 2025 (11:13 IST)
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్స్ వచ్చినట్టు ఓ ప్రచారం సాగుతోంది. వీరంతా ఆయన పర్యటించే ప్రాంతాల్లో ముందుగానే రెక్కీ నిర్వహిస్తున్నారని, జూలై 20వ తేదీన 99 టీవీ చానెల్‌లో జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ వెల్లడించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అదేసమయంలో ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా? ఉద్దేశపూర్వకంగా చెప్పారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా... వర్గాలు, ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని గుంటూరుకు చెందిన జనసేన నేత యర్రంశెట్టి సాయినాథ్ ఫిర్యాదు మేరకు జులై 22న నల్లపాడు పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణకు రావాలని వాసుదేవన్‌కు పోలీసులు 41ఏ నోటీసు ఇవ్వడానికి జులై 26వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
 
పోలీసులు ఈ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సీఈఓ, ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల స్టేట్‌మెంట్ తీసుకున్నారు. వాసుదేవన్‌ను జులై 29వ తేదీన విచారణకు గుంటూరు పంపుతామని వారు చెప్పడంతో పోలీసులు వచ్చేశారు. ఆ రోజు విచారణకు రాకపోవడంతో ఆ విషయాన్ని ఛానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అదేరోజు ఛానల్ చీఫ్ ఎడిటర్ భావనారాయణ నల్లపాడు స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు. 
 
వాసుదేవన్ కథనంపై తమకెలాంటి సమాచారం లేదని, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలున్నాయో తెలియదని చెప్పినట్టు సమాచారం. వాసుదేవన్ వ్యాఖ్యల వీడియోను పరిశీలించిన పోలీసులు.. గతంలో ఆయన చేసిన విశ్లేషణలనూ పరిశీలిస్తున్నారు. ఆయన అందుబాటులో లేరని, చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని నల్లపాడు సీఐ వంశీధర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు