ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలాడుతూనే ఉంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం ఇప్పుడల్లా ఆగేల కనిపించడం లేదు. ఇప్పటికే 20 మంది వైసిపి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరగా, తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమాలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే జి.వెంకటరెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్ధమయింది.
ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2014 ఎన్నికలలో టిడిపి 5 స్థానాలు గెలుచుకోగా, ఆరు స్థానాలను వైసిపి గెలుచుకొంది. మిగిలిన ఒక్క అసెంబ్లీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ది గెలిచాడు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ఎమ్మేల్యే అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టిడిపిలో చేరారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా టిడిపిలో చేరారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరితే ప్రకాశం జిల్లాలో వైసిపి ఖాళీ అయినట్టే. ఇంకా వైసీసీ అధినేత జగన్ మీనమేషాలు లెక్కిస్తూ, ఉంటే పార్టీకి వచ్చే ఎన్నికల్లో నాయకులే మిగలరని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.