ఏపీలో గురుకులాల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు

శనివారం, 6 జూన్ 2020 (09:44 IST)
కరోనా కారణంగా కుంటుపడిన తరగతులను గట్టెక్కించేందుకు పలు ప్రభుత్వాలు. వివిధ శాఖలు రకరకాల కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ వినూత్న ఆలోచన చేపట్టింది. 

విద్యార్థులను ఇప్పట్లో తరగతి గదులకు రప్పించే పరిస్థితి లేకపోవడంతో 9 నుంచి ఇంటర్మీడియట్ తరగతుల వారికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు అనువుగా, నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. 

ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.6 వేల విలువగల స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో 30-40 శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ఇతర విద్యార్థులకు ఎలాంటి ఆటంకాల్లేకుండా బోధన అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది. 
 
తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
నెలకు ఒక్కో పాఠశాలకు 300 లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌, 150 లీటర్ల సబ్బు ద్రావణం సరఫరా చేయాలని, 189 గురుకులాల్లో ఆంగ్ల ల్యాబ్‌ల ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో 2, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఆహారం తయారీ, క్యాటరింగ్‌ను పొరుగుసేవల విధానంలో అప్పగించాలని నిర్ణయించింది.

కొత్తగా 34 గురుకులాల్లో అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని, పరిశుభ్రత, పచ్చదనంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తొలిస్థానంలో నిలిచిన గురుకులానికి రూ.50 వేలు, ద్వితీయ స్థానానికి రూ.30 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు