ఎస్‌జెఆర్‌వో రాష్ట్ర స్థాయి తొలి ఎగ్జిక్యూటీవ్ సమావేశాన్ని శనివారం ఉదయం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కా సాయిబాబు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో జరుగుతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం కారణంగా నష్టపోతున్న పౌరుల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవడమే లక్ష్యంగా సామాజిక బాధ్యతగా భావించి సంస్థ సభ్యులు పనిచేయాలని కోరారు.
సమాజంలో మార్పు రావాలని కోరుకునే ప్రతి వ్యక్తిని గుర్తించి వారితో కలిసి పనిచేయడం సంస్థ లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. సమాజంలో పెరిగిపోతున్న కాలుష్యం, తగ్గిపోతున్న నైతిక విలువలు, ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పులు వంటి అంశాలపై సభ్యులు నిరంతరం గుర్తుచేసుకుంటూ, లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తామని ప్రమాణం చేయించారు. పర్యావరణ హితం కోసం గ్రో గ్రీన్, గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు చేపట్టి మనిషిలా జీవించాలని కోరారు.
సమావేశానికి ఎస్‌జెఆర్‌వో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి ధాత్రి అధ్యక్షత వహించగా కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నాప్రగఢ ప్రసాద్, కొంకిమళ్ళ శంకర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మీ, వివిధ జిల్లాల నుంచి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.