ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పోరాటం చేస్తానని ప్రకటించారు. తాను దశల వారీగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. అవసరమైతే తుదిదశలో తన పార్టీ ఎంపీల చేత రాజీనామా లైనా చేయిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నుంచి ప్రలోభ పెట్టి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యే లచే చంద్రబాబు రాజీనామా చేయించాలని దమ్ముంటే ఉపఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. వాటిలో వచ్చిన ఫలితాలనే రెఫరెండంగా భావించాలని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో తానూ ప్రత్యేక హోదా కోసం దశల వారీగా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్‌ను జగన్ కాపీ కొడుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక హోదా కోసం దశల వారీగా పోరాటాన్ని వేగం పెంచుతామని.. అందుకోసం చివరిదశలో ఎంపీల రాజీనామాకు పట్టుబడతామని పవన్ తిరుపతిలో ప్రకటించాడు. కాకినాడ సభలో విమర్శల వరకే పరిమితమైన పవన్.. ఆపై తట్టాబుట్టా సర్దుకుని షూటింగ్‌కు వెళ్ళిపోయాడు.
కానీ ఎపి ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ప్రత్యేక హోదా కోసం రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. పవన్ తిరుపతి సభలో ప్రకటించినట్లుగా తానూ ప్రత్యేక హోదా కోసం దశల వారిపోరాటాన్ని చేస్తానని ప్రకటించారు. సాక్షి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడారు. గతంలో ప్రత్యేక తెలంగాణా కోసం కూడా కేసీఆర్ పదే పదే రాజీనామా అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామాలకు సిద్ధపడతామని చెప్పడం సంచలనంగా మారుతోంది.
అదే జరిగితే చంద్రబాబుకి పెద్దస్థాయిలో చిక్కులు తప్పవని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు ప్రజల ముందు దోషిగా నిలబడతారని భావిస్తున్నారు. దానికితోడుగా రాజధాని సహా అన్ని అంశాల మీద జగన్ వైఖరిలో స్పష్టత కనిపించడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌ని ఇంటర్య్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చేతుల్లోని కాగితాలు జారిపోయిన సందర్భంలో ఆ సంస్థకు యజమానిగా ఉన్న జగన్ ఆ కాగితాలను వంగి తీసుకుని తన దగ్గర పనిచేస్తున్న జర్నలిస్టుకి అందించిన తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది. జగన్ అభిమానుల్లో తమ నాయకుడి తీరు పట్ల, ఆయన వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని పెంచేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జగన్ తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూ రాజకీయాల్లో కాస్త వేడి పుట్టించాయి. పార్టీ వర్గాల్లో, కార్యకర్తల్లో బూస్టునిచ్చాయని రాజకీయ పండితులు చెప్తున్నారు.