ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో రాజమౌళి సహకారాన్ని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆకృతులపై చర్చించేందుకు రాజమౌళి అమరావతి వచ్చారు. ఇప్పటికే రాజమౌళిని కలిసి ఆకృతుల గురించి మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ వివరించారు.
తెలంగాణలోని యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, ఆలయ పరిసరాల అభివృద్ధికి సంబంధించి సినీ ఆర్ట్ డైరెక్టర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదించిన విషయం విదితమే. ఆ ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చిన డిజైన్ల మేరకే అక్కడ అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినీ జనాల్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనడానికి ఇదొక నిదర్శనం.
ఇదే తరహాలో ఇప్పటికే అమరావతి డిజైన్ల విషయంలో ప్రపంచంలోనే టాప్-10 సంస్థల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. ఆయా సంస్థలు డిజైన్లు కూడా ఇచ్చాయి. కానీ అవేవీ చంద్రబాబుకు నచ్చలేదు. అందుకే, రంగంలోకి రాజమౌళిని దించాలనుకున్నారు.
మరి రాజమౌళి సూచనలు చంద్రబాబు నచ్చుతాయో లేదో అనే విషయాన్ని పక్కనబెడితే.. ఏపీలో టీడీపీ పరిపాలనకు వచ్చి మూడున్నరేళ్ళ తర్వాత కూడా, రాజధాని అమరావతి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వంకలు వెతుక్కుంటున్నట్టున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.