మైనర్ బాలిక మృతిపై విచారణ నివేదిక సమర్పించండి: విశాఖ సీపీ కి ఏపీ మహిళా కమిషన్ ఆదేశాలు

మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:09 IST)
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధి అగనంపూడి వద్ద ఇటీవల జరిగిన మైనర్ బాలిక పాండ్రంకి పావని మృతి కేసుపై ఏపీ మహిళా కమిషన్ దృష్టి సారించింది. బాలిక మృతికి సంబంధించిన కారణాలపై విచారణ నివేదిక కోరుతూ విశాఖ పోలీసు కమిషనర్ కు లేఖ రాసింది.

పావని మృతి సంఘటన రోజే ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. కమిషన్ సభ్యురాలు సైతం ఘటనాస్థలికి వెళ్ళి పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు వెల్లడించిన సమాచారం... అనంతరం బాలిక మృతిపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఈ విషయంపై మరోమారు స్పందించారు.   

బాలిక మృతి ఆత్మహత్యనా.. హత్యనా అనే విషయంలో వాస్తవాలను నిగ్గుతేల్చాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు