ప్రైవేటు డిగ్రీ కళాశాలలను అధీనంలోకి తీసుకుంటున్నారా?

శుక్రవారం, 12 నవంబరు 2021 (21:42 IST)
డిగ్రీ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపునకు.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ఉన్నత విద్యా మండలికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. సీట్లను కేటాయించొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను.. యాజమాన్య కోటా కింద ఉన్న 30 శాతం సీట్లకే పరిమితం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ.. తీర్పును రిజర్వ్‌ చేసింది.
 
★ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కన్వీనర్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం జారీచేసిన జీవో 55ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. 
 
★ విచారణ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
★ ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటోందని గుర్తుచేసింది. 
 
★ ఆన్‌లైన్ ప్రవేశాల పేరుతో ప్రైవేటు డిగ్రీ కళాశాలల్ని అధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తోందా..? అని ప్రశ్నించింది. 
 
★ భవిష్యత్తులో 9 నుంచి 12 తరగతులకు వర్తించకుండా నిలిపేస్తారా.. ? అని అడిగింది. 
 
★ ప్రపంచం మొత్తం ప్రైవేటీకరణ జరుగుతుంటే.. రాష్ట్రంలో గవర్నమెంటైజేషన్ జరుగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 
 
★ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య సీట్లను భర్తీ చేసుకునేందుకు.. అవకాశం కల్పించకపోతే.. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ధర్మాసనం పేర్కొంది. 
 
★ ఆదాయం లేకుండా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది.
 
★ జీవో 55ను సవాల్‌ చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన రాయలసీమ డిగ్రీ కళాశాల అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. 
 
★ 30 శాతం యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్ భర్తీ చేస్తారని జీవోలో పేర్కొనడం.. చట్ట విరుద్ధమన్నారు. 
 
★ యాజమాన్యాలు సీట్లను భర్తీ చేసుకోకుండా జీవో నిలువరిస్తోందని.. ఇది వారి హక్కుల్ని హరించేందిగా ఉందన్నారు. 
 
★ 70 శాతం కన్వీనర్ సీట్ల విషయంలో తమకు అభ్యంతరం లేదన్నారు.
 
★ మరో పిటిషన్‌దారు... మాల మహానాడు ఐక్యవేదిక తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. 
 
★ 30 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద కేటాయించడానికి వీల్లేదన్నారు.
 
★ దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని వివరించారు. 
 
★ యాజమాన్య కోటా కింద సీటు పొందిన వారు అధిక రుసుములు చెల్లించాల్సి ఉంటుందని..... వారికి.. విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు వర్తింపజేయరన్నారు. 
 
★ ఉపకార వేతనాలు చెల్లించకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం... 30 శాతం సీట్లను యాజమాన్యానికి కేటాయించిందన్నారు. 
 
★ ప్రైవేటు కళాశాలల లాభార్జన కోసం.. ఆ జీవో ఇచ్చినట్లుందన్నారు. 
 
★ ఆ జీవోను రద్దుచేయాలని కోర్టును కోరారు.
 
★ విద్యాశాఖ తరఫున న్యాయవాది రఘువీర్‌, ఉన్నత విద్యామండలి తరఫున న్యాయవాది సుదేశ్‌ ఆనంద్‌ వాదనలు వినిపించారు. 
 
★ యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్ కేటాయించున్నారని చెప్పారు. 
 
★ విద్యార్థులు యాజమాన్య కోటా సీట్లను ఎంపిక చేసుకునే ప్రక్రియకు కన్వీనర్‌ వెసులుబాటు మాత్రమే కల్పిస్తారన్నారు. 
 
★ ప్రభుత్వ జీవోతో విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగదని చెప్పారు. 
 
★ 2.13 లక్షల మంది విద్యార్థులు.. వెబ్ ఐచ్ఛికాల ద్వారా ఇప్పటికే కళాశాలల్ని ఎంపిక చేసుకున్నారని వివరించారు. 
 
★ తీర్పు వెల్లడించే లోపు కన్వీనర్‌ కోటా కింద 70 శాతం సీట్ల కేటాయింపునకు వెసులుబాటు కల్పించాలని కోర్టును కోరారు. 
 
★ అందుకు అంగీకరించిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు