భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకస్థానం : డా.సముద్రాల లక్ష్మణయ్య
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:24 IST)
యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందని, వారి సంకీర్తనల్లో నవవిధ భక్తి మార్గాలను తెలియజేశారని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు మాజీ ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మణయ్య తెలియజేశారు. శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాహితీ సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన డా. సముద్రాల లక్ష్మణయ్య ఉపన్యసిస్తూ భారతీయుల జీవన విధానానికి వేదాలే మార్గదర్శకాలని, అలాంటి వేదాలను శాస్త్రాలుగా, పురాణాలుగా, కావ్యాలుగా కవులు రచించారని తెలిపారు. వేదాంతార్థాలు స్ఫురించేలా మృదుమధురమైన తెలుగు పదాలతో అన్నమయ్య సంకీర్తనలు రచించారని వివరించారు.
తిరుపతికి చెందిన ఇజి.హేమంతకుమార్ 'అన్నమాచార్య సంకీర్తనలు - నైతిక ప్రబోధం' అనే అంశంపై ఉపన్యసిస్తూ మానవులు నీతిగా, ధర్మబద్దంగా జీవనం సాగించాలని అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారని చెప్పారు. జాగ్రత్తగా మాట్లాడాలని, ఇతరులను బాధ పెట్టడం కంటే మనం బాధ పడడం మేలని, ఇతరుల సంపదపై ఆశ పెంచుకోరాదని, ఆకాశం కంటే ఆశ పెద్దదని, ఆడంబర జీవితం కంటే సామాన్య జీవితం మేలని, సంపాదన ధర్మబద్ధంగా ఉండాలని అన్నమయ్య తెలియజేసినట్టు చెప్పారు.
చంద్రగిరికి చెందిన సంగీతం కేశవులు 'వెంగమాంబ సాహిత్యంపై అన్నమయ్య ప్రభావం' అనే అంశంపై మాట్లాడారు. వెంగమాంబ సాహిత్యంపై అన్నమయ్య ప్రభావం మెండుగా ఉందన్నారు. చాలా అంశాల్లో ఇద్దరికీ సామీప్యత ఉందని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో అన్నమయ్య లాలిపాటను వెంగమాంబ ముత్యాలహారతిని ప్రవేశపెట్టారని వివరించారు. అన్నమయ్య 32 బీజాక్షరాలతో కూడిన నృసింహ మంత్రాన్ని పఠించి 32 వేలకు పైగా సంకీర్తనలు రచించగా, వెంగమాంబ కూడా ఇదే మంత్రాన్ని పఠించి 18 గ్రంథాలను రచించారని తెలిపారు.
చంద్రగిరికి చెందిన కె.సుబ్రమణ్యం 'అన్నమయ్య సప్తగిరి సంకీర్తనలు' అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య బహుళ ద్వాదశి, జయంతి, వర్ధంతి ఉత్సవాల్లో సప్తగిరి సంకీర్తనలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. వీటిలో భావములోన బాహ్యమునందును...., బ్రహ్మకడిగిన పాదము....., నారాయణతే నమో నమో...., పొడగంటిమయ్యా...., ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన...., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు..., ముద్దుగారే యశోద.... సంకీర్తనలు ఉన్నాయన్నారు. నొటేషన్లపాటు ఈ సంకీర్తనలను టిటిడి పుస్తకరూపంలోకి తీసుకొచ్చిందని, ఇప్పటివరకు 3 లక్షల కాపీలు ముద్రించారని తెలిపారు. మారుమూల గ్రామాల్లోని ఆలయాల్లోనూ ఈ పుస్తకం లభిస్తుందని చెప్పారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు తిరుచానూరుకు చెందిన కుమారి కెఎస్.రమ్య, కెఎస్.సౌమ్య బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు శ్రీ ఎస్.వి.ఆనందభట్టర్ బృందం గాత్ర సంగీత సభ నిర్వహిస్తారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి టి.శ్రీనిధి బృందం గాత్రం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు టిటిడి ఆస్థాన గాయకులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ బృందం గాత్ర సంగీత కార్యక్రమం జరుగనుంది.