రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసిన చంద్రబాబు టీం

సోమవారం, 25 అక్టోబరు 2021 (15:07 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఏడుగురు నేతల టీడీపీ బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా పలువురు నేతలున్నారు. 
 
ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏక కాలంలో జరిగిన దాడులను వివరించినట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడుతూ, టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కోరినట్టు చెప్పారు. 
 
ఏపీ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు.డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. 
 
రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని అన్నారు. 
 
రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని అన్నారు. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చంద్రబాబు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు